: తెలంగాణలో జెండా పాతాల్సిందే: అమిత్ షా
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరుసగా మూడవ రోజూ పర్యటిస్తున్నారు. నేడు నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన, మోదీ నేతృత్వంలో ముందుకు సాగి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలమన్న నమ్మకం తనకు రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ప్రతి కార్యకర్తా సుశిక్షితుడైన సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబాలను కలవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పిన అమిత్ షా, రజాకార్లను ఎదిరించి నిలిచిన ఘటన గుండ్రాంపల్లి వాసులదేనని కొనియాడారు. తెలంగాణలో జెండా పాతాల్సిందేనని, ఆ దిశగా అన్ని ప్రాంతాలూ తిరిగి కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపుతానని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదే సమయంలో కేంద్రం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.