: మార్గరెట్ థాచర్, పీవీ, దావూద్ ఇబ్రహీం, బ్రూనై సుల్తాన్... అందరూ చంద్రస్వామి శిష్యులే... ఆయన జీవితంపై ఆసక్తికర విశేషాలు!
చంద్రస్వామి... ఇటీవలి కాలంలో ఈ పేరు పెద్దగా వినిపించక పోయినా, ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నప్పుడు చంద్రస్వామి పేరు మారుమ్రోగేది. ఆయన ఎక్కడికి వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతాలు ఉండేవి. ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతూ, కోటీశ్వరులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన వివాదాస్పద తాంత్రిక వేత్త చంద్రస్వామి. శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలోకి వెళ్లగా నిన్న చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో చంద్రస్వామి జీవితంపై ఆసక్తికర అంశాలివి.
చంద్రస్వామి అసలు పేరు నేమిచంద్. రాజస్థాన్ లోని బెహ్రోర్ ప్రాంతానికి చెందిన ఆయన తండ్రి, జీవితాన్ని గడిపేందుకు హైదరాబాద్ కు వచ్చి వడ్డీ వ్యాపారం ప్రారంభించారు. చిన్నతనంలోనే ఇల్లు వదిలేసి వచ్చిన నేమిచంద్, గోపీనాథ్ కవిరాజ్ వద్ద తాంత్రిక విద్యలు నేర్చుకుని తన పేరును చంద్రస్వామిగా మార్చుకున్నారు. ఆపై బీహార్ అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసి సిద్ధులకు మాత్రమే సాధ్యమైన విద్యలెన్నో నేర్చుకున్నానని ఆయన చెప్పేవారు.
జ్యోతిష్యంలో నైపుణ్యం ఉండటం, ఆయన హావభావాలు అచ్చమైన తాంత్రికుడిలా కనిపిస్తుండేసరికి మహామహులుగా పేరు తెచ్చుకున్న వారు చంద్రస్వామి అనుగ్రహం కోసం క్యూ కట్టేవారు. బ్రునై సుల్తాన్, బహ్రైన్ కు చెందిన షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్, ఆయుధాల దళారి అద్నాన్ ఖషొగ్గి, చీకటి సామ్రాజ్యాధినేత డాన్ దావూద్ ఇబ్రహీం తదితరులు ఎందరో ఆయనతో తరచూ మాట్లాడుతూ సలహాలు పొందుతుండేవారు.
1975లో థాచర్ కార్యాలయానికి వెళ్లిన చంద్రస్వామి, మరో నాలుగేళ్లలో ఆమె ప్రధాని అవుతారని, ఆపై పదేళ్లు రాజ్యమేలుతారని ఆయన జ్యోతిష్యం చెప్పగా, అదే జరిగింది. దీంతో ఆమె కోటరీలో చంద్రస్వామి ముఖ్యుడిగా మారగా, ఆపై ఎన్నో మార్లు ఆమె చంద్రస్వామి సలహాలు స్వీకరించినట్టు వార్తలు వచ్చాయి. అందరికీ మించి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావుకు అత్యంత దగ్గరి సన్నిహితుడిగా చంద్రస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో ఆరోపణలు రాగా, కొంతకాలం జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది.
పీవి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీలో ‘విశ్వ ధర్మయాతన్ సనాతన్’ అనే ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాజీవ్ గాంధీ హత్య కేసు వెనక చంద్రస్వామి పాత్ర కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఎల్టీటీఈకి చంద్రస్వామి నిధులను అందించారని మిలాప్ చంద్ జైన్ కమిటీ నివేదిక ఇవ్వడంతో, ఆయన విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు. లండన్ కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన కేసులో జైలుకు వెళ్లి, జరిమానా కట్టారు. పీవీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన, పీవీ మరణం తరువాత నెమ్మదిగా తెరమరుగయ్యారు. ఆపై అనారోగ్యం బారిన పడి ఎన్నో ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. మంగళవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. ఆ విధంగా ఓ వివాదాస్పద తాంత్రికుడి జీవితం ముగిసింది.