: చలపతి బాబాయ్ చేసింది తప్పే.. కేసులు మాత్రం వద్దు: నటి హేమ
మహిళల గురించి టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మహిళా సంఘాలు ఆయనపై కేసులు కూడా పెట్టాయి. చలపతిరావు చేసిన కామెంట్లను సినీ ప్రముఖులు కూడా ఖండించారు. తాజాగా ఆయన కామెంట్ పై నటి హేమ స్పందిస్తూ... ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, అందువల్ల ఆయనపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని కోరారు. ఓ ఆడియో ఫంక్షన్ లో చలపతి బాబాయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా తప్పేనని... ఈ విషయానికి సంబంధించి తన కో ఆర్టిస్ట్ ఝాన్సీ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిందని తెలిపింది.
వాస్తవానికి చలపతి బాబాయ్ చాలా మంచివారని, మహిళల గురించి తప్పుగా ఒక్క పదం పలకడానికి కూడా వందసార్లు ఆలోచిస్తారని హేమ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన... ఏనాడూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదని తెలిపింది. ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని కేసులను విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేసింది. మహిళలంతా ఇలాగే ఐకమత్యంతో మెలిగితే... మహిళలపై సోషల్ మీడియాలో ఒక్క తప్పు రాయడానికి కూడా అందరూ భయపడతారని చెప్పింది. ఎవరూ కూడా మహిళల గురించి చులకనగా మాట్లాడకూడదని తెలిపింది.