: జాదవ్ ను అరెస్ట్ చేసింది పాక్ లో కాదు... పన్నాగాన్ని స్వయంగా బయటపెట్టిన ఆ దేశ నిఘా అధికారి
భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ను తమ దేశంలోనే అరెస్ట్ చేశామని పాకిస్థాన్ బుకాయిస్తోందని తేటతెల్లమైంది. జాధవ్ ను పాకిస్థాన్ లో అరెస్ట్ చేయలేదని, ఇరాన్ లో పట్టుకున్నామని పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ అధికారి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంజాద్ షోయబ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇంతవరకూ అతడిని బెలూచిస్థాన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టుగా పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇరాన్ నుంచి వచ్చి తమ దేశంలో ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొనేందుకు జాదవ్ రాగా, తాము పట్టుకున్నామని పాక్ ప్రకటించగా, ఇప్పుడీ అంజాద్ వ్యాఖ్యలతో పాక్ చెప్పేదంతా అబద్ధమేనని తేలిపోయింది. ఇదిలావుండగా, జాదవ్ పై తమ దేశ సైనిక కోర్టు మరణశిక్షను విధించినందున ఐసీజేలో త్వరగా విచారణ ముగించి తుది తీర్పు ఇవ్వాలని పాక్ ప్రభుత్వం కోరుతోంది. తుది తీర్పు వచ్చేంత వరకూ శిక్షను అమలు చేసే వీలు లేకపోవడంతోనే పాక్ ఈ మేరకు ఐసీజే ముందు పిటిషన్ వేసిందన్న సంగతి విదితమే.