: వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ సినిమాకి అప్పుడే చిక్కులు!
'ది మహాభారత'... భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రం. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ రచించిన 'రాందమూళం' నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే, ఇంకా చిత్రీకరణ మొదలు కాకుండానే ఈ సినిమాకు అడ్డంకులు ప్రారంభమయ్యాయి.
ఈ సినిమాకు మహాభారత అని పేరు పెడితే ఊరుకోబోమంటూ కేరళకు చెందిన హిందూ ఐక్యవేది సంఘం హెచ్చరించింది. రాందమూళం నవల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నప్పుడు... ఈ చిత్రానికి అదే పేరు పెట్టాలని సంఘం అధ్యక్షురాలు కేపీ శశికళ డిమాండ్ చేశారు. తమ మాటను కాదని మహాభరత అనే పేరునే పెడితే థియేటర్లలో సినిమాను ఆడబోనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. రాందమూళం నవల ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు... వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాందమూళం నవల ప్రధానంగా భీముడు గురించే ఉంటుంది. ఈ పాత్రను ప్రముఖ నటుడు మోహన్ లాల్ పోషించనున్నారు. రెండు భాగాలుగా నిర్మితం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ 2018 సెప్టెంబర్ లో మొదలుకాబోతోంది. 2020లో ఈ సినిమా విడుదల కాబోతోంది. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ఈ సినిమాను రూ. 1000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు.