: ఎయిర్‌టెల్, వోడాఫోన్ బంపర్ ప్యాక్‌లు.. ఇక 90 శాతం తగ్గనున్న రోమింగ్ బిల్లులు!
పర్యాటకుల ఫోన్ బిల్లులను 90 శాతం వరకు తగ్గించడమే ధ్యేయంగా టెలికం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, మాట్ర్రిక్స్‌లు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్‌ను తీసుకొచ్చాయి. ఈ ప్యాక్స్ వల్ల కాల్ చార్జీలు 60-90 శాతం వరకు తగ్గుతాయని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి.
రోమింగ్ ప్యాక్‌ల ద్వారా వినియోగదారులకు అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ అందనున్నాయి. మిగతా కంపెనీలు ఆఫర్ చేస్తున్న దానితో పోలిస్తే తమ సేవలు 25 శాతం చవగ్గా లభిస్తాయని మాట్రిక్స్ తెలిపింది. డేటా, వాయిస్ కాల్స్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి 90 శాతం, తక్కువగా ఉపయోగించే వారికి 65-70 శాతం వరకు రాయితీలు పొందే అవకాశం ఉందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. తాజా ప్యాక్‌ల వల్ల ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ప్రస్తుతం రూ.600కు ఒక ఎంబీ డేటా లభిస్తుండగా, అది ఇప్పుడు మూడు రూపాయలకే లభించనున్నట్టు తెలిపారు.
ఎయిర్‌టెల్ ఒక రోజు, పది రోజులు, 30 రోజుల వ్యాలిడిటితో రోమింగ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకురాగా, వొడాఫోన్ రూ.2,500కు వారం వ్యాలిడిటీతో అన్ లిమిడెట్ డేటా, వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇవే సేవలను రూ.5 వేలు చెల్లించి నెలపాటు అందుకోవచ్చు. మాట్రిక్స్ కూడా రూ.2,999తో ఇటువంటి ప్లాన్‌నే 15 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవన్నీ అమెరికా, బ్రిటన్ వెళ్లే పర్యాటకులను ఉద్దేశించి ప్రకటించినవే కావడం గమనార్హం.