: పెళ్లయిన 24 గంటల్లోనే వంచించిన ప్రియుడిపై పగతీర్చుకున్న యువతి!


ప్రేమించానని వెంటబడ్డాడు. నాలుగేళ్లు చెట్టాపట్టాలు వేసుకుని ఆమెతో తిరిగాడు. అకస్మాత్తుగా రకరకాల కారణాలు చెప్పి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతను పెళ్లి చేసుకుని 24 గంటలు కూడా గడవకముందే, ప్రియురాలు అతనిపై పగతీర్చుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఖాజాపీర్‌ దంపతులకు ఇలియాజ్‌ (24) రెండో కుమారుడు. గుంటూరులోని జేకేసీ కళాశాలలో ఐదేళ్ల క్రితం డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఆ సమయంలోనే స్థానిక అభ్యుదయ కళాశాలలో చదువుకునే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల తర్వాత ఆమెను వదిలేసి పెదకాకానికి చెందిన రోజ్‌ మేరీని ప్రేమించాడు. పెద్దలకు విషయం తెలిసి 22వ తేదీ సోమవారం స్థానిక పాములపాడు మసీదు సమీపంలో వారిద్దరికీ వివాహం జరిపించారు.

ఈ విషయం తెలిసిన మొదటి ప్రేయసి... ఇలియాజ్‌ స్నేహితుడు ఖాసింకు ఫోన్‌ చేసి, తన ఫోటోలు అతని వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పించాలని కోరింది. దీంతో ఖాసిం తన స్నేహితుడు ఇలియాజ్‌ ను కలసి, 'ఆ అమ్మాయి గొడవ చేయాలని భావించడం లేదు, ఆమె ఫోటోలు ఆమెకు ఇచ్చేస్తే సరిపోతుంద'ని చెప్పాడు. అప్పటికే వివాహ తంతు పూర్తికావడంతో సంప్రదాయం ప్రకారం ఇలియాజ్‌ సోదరుడు కొత్త దంపతులిద్దరినీ పెదకాకానిలోని అత్తవారింటికి పంపించాడు. అతను అత్తవారింటికి చేరుకోగానే... మొదటి ప్రేయసి ఇలియాజ్ కు ఫోన్ చేసింది. తాను వెనిగండ్లలో ఉన్నానని, తన ఫోటోలు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇలియాజ్ మధ్యాహ్నం అత్తవారింటి నుంచి ఆమెను కలిసేందుకు బయటకు వెళ్లాడు.

ఆ సాయంత్రం 3 గంటలకు స్థానికులు ఇలియాజ్ సోదరుడికి ఫోన్ చేసి, మీ సోదరుడిపై యాసిడ్ దాడి జరిగిందని, గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన ఇలియాజ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా, తాను ప్రేమించిన యువతి తనపై యాసిడ్ దాడి చేసిందని, తాను ఎక్కువ సేపు బతకనని చెప్పాడు. దీంతో అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఇలియాజ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనలో అతని ప్రేయసితో పాటు మరికొందరు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇలియాజ్ స్నేహితుడు ఖాసింను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News