: నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి.. మరోసారి క్షమాపణలు చెబుతున్నాను!: నటుడు చలపతిరావు
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమారు, క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాశారు. ‘డబ్భై మూడేళ్ల వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. ‘ఆడవాళ్లతో హానికరమా?’ అన్న ప్రశ్నకు జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు’ అన్నాను. ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేసిన పరిస్థితి... నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చేయకుండా ఉండాల్సింది.
ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతున్నాను. ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరాఖరికి, ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో, మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్య శ్రవణాలకు మనందరం బాధ్యులమే! పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా! ఆ విషయం మనందరికీ తెలుసు. నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పేమాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి. ఇకముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు.
నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ,
మరోసారి క్షమాపణలు చెబుతున్నాను.
మన్నించండి!
మీ
చలపతిరావు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.