: ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుంది: అమిత్ షా
నల్గొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన తరువాత అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీతో మైత్రి కొనసాగుతుందని ఆయన అన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉంటుందా? అన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికి ఇంతే చెప్పదలుచుకున్నానని అన్నారు. దేశంలో రహదారుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని అన్నారు. గిరిజన రిజర్వేషన్లను తాము స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి పార్టీని విస్తరింపజేస్తున్నామని చెప్పారు. కొన్ని రోజుల్లో మోదీ పాలనకు మూడేళ్లు పూర్తవుతాయని, దేశంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలని వివరిస్తామని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణకు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని అన్నారు.