: విమానంలో ట్రంప్ మద్దతుదారుడు రెచ్చిపోయాడు!
చైనాలోని షాంఘై నుంచి న్యూజెర్సీలోని నవార్క్ కు వెళుతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు నానా హంగామా చేశాడు. ‘మేక్ అమెరికన్ గ్రేట్ ఎగైన్’ అనే నినాదంతో ఉన్న క్యాప్ ను ధరించిన సదరు వ్యక్తి తన సీట్లో కూర్చుని ముందు సీటుపై కాళ్లు పెట్టాడు. దీంతో, విస్తుపోయిన ముందు సీట్లోని ప్రయాణికుడు సహా మిగిలిన ప్రయాణికులు ఇవేమి పనులంటూ ప్రశ్నించారు.
దీంతో, సదరు ప్రయాణికులపై ఆయన విరుచుకుపడ్డాడు. తాను కూర్చున్న వరుసలోని సీట్లన్నీ తనకు కావాలని, అందులో, ఎవరూ కూర్చోవడానికి వీల్లదని అరుస్తూ గోల చేశాడు. దీంతో, విసిగిపోయిన మిగిలిన ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో, ఎట్టకేలకు, ఆయన్ని విమానం నుంచి దించి వేయాల్సి వచ్చింది. కాగా, ఈ గొడవ కారణంగా విమానం గమ్యం చేరడానికి దాదాపు ఐదు గంటలపాటు ఆలస్యమైంది.