: ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలపై జియో ఫిర్యాదు
టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చింది మొదలు మిగతా కంపెనీలు జియోపై పలు సార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. జియో కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ ప్రత్యర్థి కంపెనీల తీరుపై ఫిర్యాదు చేస్తూ వస్తోంది. తాజాగా జియో మరోసారి భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి ఫిర్యాదు చేసింది. ఆయా కంపెనీలు అవసరమైన లైసెన్స్ ఫీజులను జమ చేయడం లేదని, దీనివల్ల సర్కారుకి ఎంతో నష్టం కలుగుతోందని చెప్పింది.
గత త్రైమాసికంలో ఆయా కంపెనీలు ముందస్తు లైసెన్స్ ఫీజును తక్కువగా చెల్లించడంతో మొత్తం రూ .400 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించింది. ఆయా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆ కంపెనీలకు రూ.50 కోట్ల చొప్పున జరిమానా విధించాలని సూచించింది. ఏయే నెలల్లో ఆయా కంపెనీలు ఎంతెంత లైసెన్సు ఫీజులను ఎగ్గొట్టాయనే విషయలను కూడా జియో తన ఫిర్యాదులో పేర్కొంది.