: జగన్ కు శాశ్వత జైలే: యనమల
ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్, తనపై ఉన్న నేరాలు రుజువైతే శాశ్వతంగా జైలుకు వెళ్లాల్సి వుంటుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవలో తెలుగుదేశం మినీ మహానాడులో పాల్గొన్న ఆయన, జగన్ కు చంద్రబాబును విమర్శించడం అలవాటై పోయిందని, నిందలు వేయడమే జగన్ నైజమని నిప్పులు చెరిగారు.
కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులను సమకూరుస్తామని ఈ సందర్భంగా యనమల హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ నెరవేరుస్తున్నామని, నిరుద్యోగులకు ఎన్నికల భృతిపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. తెలుగుదేశం, వైకాపాల మధ్య స్పష్టమైన తేడా ఉందని, ప్రజలు దీన్ని గుర్తించాలని కోరారు. వైకాపాలో నేరచరితులు ఉన్నారని, వారిలో కొందరు తప్పు తెలుసుకుని సరిదిద్దుకుని బయట పడ్డారని యనమల వ్యాఖ్యానించారు.