: ‘బాహుబలి-2’ కంటే నా సినిమా కలెక్షన్లే అత్యధికం!: కొత్త లెక్కలు చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ సినిమాకు సినీ ప్రముఖులందరి నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొంత మంది మాత్రం ఈ సినిమా సాధించిన భారీ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. ఇప్పటికే బాహుబలి-2 ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి 1500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి, ఇంకా దూసుకుపోతోంది. బాలీవుడ్ సినిమాలు కూడా సాధించలేని విధంగా మొదటిసారి 1000, 1500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, ఈ సినిమా కొత్తగా సృష్టించిన రికార్డులు ఏమీ లేవని 2001లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ 'గదర్: ఏక్ ప్రేమ్ కహానీ' సినిమా దర్శకుడు అనిల్ శర్మ అంటున్నాడు.
అసలు 2001లోనే తన గదర్ సినిమా రూ.265 కోట్ల వసూళ్లు సాధించిందని చెప్పాడు. అప్పట్లో సినిమా థియేటర్ల సంఖ్య, టికెట్ రేట్ల పరంగా చూస్తే గదర్ సినిమా బాహుబలి కంటే అధికంగానే వసూళ్లు సాధించిందని ఆయన అన్నాడు. తన గదర్ సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేటు కేవలం 25 రూపాయలేనని, ఇప్పటి లెక్కల ప్రకారం తన సినిమాకు వచ్చిన కలెక్షన్ల విలువను చూసుకుంటే మొత్తం రూ.5 వేల కోట్లు సాధించనట్లేనని వ్యాఖ్యానించాడు. తన సినిమా రికార్డును ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేదని చెప్పాడు.