: ఉద్యోగం ఊడుతుందన్న భయం నేపథ్యంలో... ఇండియాలో ఆవిర్భవించిన తొలి టెక్కీల యూనియన్!


అది 2008... శ్రీలంకలో తమిళులపై హత్యాకాండలు సాగుతున్న సమయం. తమిళనాడులో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు 'స్టాప్ ది వార్, సేవ్ ది తమిళ్స్' అని నినదిస్తూ, చెన్నై టైడల్ పార్క్ లో భారీ ప్రదర్శన చేశారు. ఆ సమయంలోనే ఐటీ రంగంలోని ఇంజనీర్లంతా ఓ యూనియన్ పెట్టాలని భావించారు. అప్పట్లో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆపై తొమ్మిదేళ్ల తరువాత... ఐటీ కంపెనీల్లో చెప్పా పెట్టకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారన్న భయాందోళనలు పెరుగుతూ ఉండటంతో, తమిళనాడు టెక్కీలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా, తొలి యూనియన్ ను ప్రారంభించారు.

'యూనియన్ ఫర్ టెక్నాలజీ ఎంప్లాయిస్ ఇన్ ఇండియా' పేరిట దీన్ని రిజిస్టర్ చేశారు. ఇండియాలో టెక్కీలు భాగంగా ఉన్న తొలి స్వతంత్ర అసోసియేషన్ ఇదే. ఇండియాలో మధ్యతరగతి ప్రజలు నిరసన కార్యక్రమాలకు సాధారణంగానే దూరం ఉంటారని, ఐటీ రంగంలో అత్యధికంగా ఉపాధిని పొందుతున్నది మధ్య తరగతి వర్గమే అయినందున ఇంతవరకూ ఎటువంటి సంఘమూ ఏర్పడలేదని, ఇప్పుడు పరిస్థితి మారడంతో వేలాది మంది ఈ ఫోరమ్ సభ్యత్వాలు తీసుకున్నారని జయప్రకాశ్ అనే టెక్కీ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఐటీ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండటం, దాదాపు 4.5 శాతం మందికి ఉద్యోగాలు పోతాయన్న అంచనాలతో, ఒత్తిడి పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరంలోగా ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజంట్ సంస్థల్లో 56 వేల మంది ఇంటిదారి పట్టనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారందరి ప్రయోజనాలను కాపాడేందుకు ఈ సంఘం కృషి చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News