: మేమెప్పుడూ వివాదాన్ని కోరుకోలేదు... నా నైజం అదికాదు... జరిగినదంతా మంత్రులే చూశారు!: గొట్టిపాటి రవి
వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉండడం తన నైజమని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాట్లాడుతూ, తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఏనాడూ వివాదాలను కోరుకోలేదని అన్నారు. వివాదం గురించి మంత్రులతో తానేమీ మాట్లాడలేదని చెప్పారు.
జరిగిన దానికి వారే సాక్షులని, దానిపై వారికి కొత్తగా వివరించాల్సినది ఏదీ ఉండదని భావించి... దీని గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడి విషయంలో జిల్లా ప్రజల అభిప్రాయాలను మాత్రం వివరించానని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోరడమే తనపని అని, ఇలాంటి వివాదాలు చేసేవారు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసని ఆయన చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే ప్రజాసేవ ముఖ్యమని గుర్తుంచుకుంటే వివాదాలతో పని ఉండదని ఆయన స్పష్టం చేశారు.