: 2019లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందో, లేదో చెప్పలేం!: ఏపీ బీజేపీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగుతుందో, లేదో చెప్పలేమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు మిత్ర ధర్మాన్ని విస్మరించారని విమర్శించిన ఆయన, ఏపీలో తమ పార్టీ శరవేగంగా పుంజుకుంటోందని అన్నారు. 25వ తేదీన విజయవాడలో అమిత్ షా సభను విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ నేతలు ఏం మాట్లాడినా చంద్రబాబు అడ్డుకట్ట వేయడం లేదని, తాము గట్టిగా స్పందిస్తే మాత్రం ఆ తరువాత బీజేపీ నేతల గురించి మాట్లాడవద్దని చెప్పి వదిలేస్తున్నారని ఆరోపించారు.
2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఎవరమూ చెప్పలేమని, బీజేపీకి క్షేత్ర స్థాయిలో మంచి పునాదులు పడ్డాయని, తమ పార్టీలోకి వచ్చేందుకు ఎంతో మంది యువత సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో కలసి వీర్రాజు మాట్లాడారు. తెలుగుదేశం నేతల విమర్శలను చూస్తూ ఊరుకోబోమని, దీటైన సమాధానమే చెబుతామని అన్నారు.