: 200 కేసులున్న నేరగాడు గుంటూరులో అరెస్టు!
ఒంటరిగా వెళ్లి.. చాకచక్యంగా తస్కరించి వెనుదిరిగే ఘరానా దొంగను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు ఏఎస్పీ తెలిపిన వివరాల్లోకి వెళ్తే... చీరాల పట్టణానికి చెందిన దాసరి ముకేష్ చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. జల్సాలకు అలవాటు పడి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక్కడే వెళ్లి చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతనిపై 200 కేసులున్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ దొంగతనం కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన ముకేష్ కన్ను గుంటూరుపై పడింది.
తాజాగా అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ జరిగిన ప్రదేశంలో పోలీసు దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం పాత నేరస్థుడి పనిగా గుర్తించిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు అరండల్ పేటలో అతను సంచరిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడ్ని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా అతనిపై 200 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.