: ఈ పదిరోజులు వాతావరణం సంక్లిష్టంగా ఉంటుంది: వాతావరణ శాఖ డైరెక్టర్
తెలుగు రాష్ట్రాల ప్రజలు వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో పలువురు వడదెబ్బబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న పది రోజుల్లో వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని తెలుగు రాష్ట్రాల వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా రెంటచింతల వాతావరణ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆకస్మిక వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు. ఈ సమయంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. శుభవార్త ఏంటంటే...జూన్ మొదటి వారంలోనే ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయని ఆయన వెల్లడించారు.