: మరో రెండు వారాల్లో అమరావతి పరిపాలనా నగరం తుది డిజైన్లు.. ఏకాభిప్రాయానికి చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన తుది డిజైన్లను మరో రెండు వారాల్లో నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రభుత్వానికి అందించనుంది. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం చంద్రబాబు పలు డిజైన్లను పరిశీలించారు. అనంతరం మార్పులు చేర్పుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ సహా వివిధ నిర్మాణాలు రాజధానికే తలమానికంగా ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టు భవనం అంత ఆకర్షణీయంగా లేదని, దానిని మరింత బాగా తీర్చి దిద్దాలని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు సూచించారు.
పరిపాలనా నగరానికి ఉత్తరాన ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండేలా చూడాలన్నారు. అమరావతి నగరం కనిపించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పరిపాలనా నగరంలో ఎక్కడా ప్రైవేటు ఆస్తులకు చోటులేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్ సెంటర్ సమీపంలోనే సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని నిర్మించాలని చంద్రబాబు సూచించారు. నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ-బస్ వేల గురించి ఈ సందర్భంగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి సూచించారు.