: పాక్‌కు ఒకే వేదికపై రెండుసార్లు అవమానం.. పాక్ మీడియా గగ్గోలు!
రియాద్‌లో సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్‌కు రెండుసార్లు అవమానం ఎదురైంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. ఏ దేశమూ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చకూడదంటూ నవాజ్‌ను ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం అంటే మరేంటో కాదని, మంచి చెడుల మధ్య పోరేనని అభివర్ణించారు.
ఉగ్రవాదంపై యుద్ధమంటే పాశ్చాత్య దేశాలకు, ఇస్లాంకు మధ్య పోరుగా భావించరాదన్నారు. తమ గడ్డపై నుంచి విస్తరిస్తున్న ఉగ్రవాదంపై పశ్చిమాసియా దేశాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు. యూరప్, భారత్, దక్షిణ అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియాలు ఉగ్రవాదుల ఆటవిక దాడులకు బలయ్యాయని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరును జాతుల మధ్య, మత విశ్వాసాల మధ్య పోరుగా భావించవద్దని సూచించారు. మీ పిల్లలకు ఎటువంటి భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీరే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చవద్దంటూ షరీఫ్‌కు ట్రంప్ తొలి షాక్ ఇవ్వగా రెండోది కూడా అదే వేదికపై జరిగింది. 35 ముస్లిం మెజారిటీ దేశాధినేతలు హాజరైన ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాల్లో అతిపెద్దదైన పాకిస్థాన్ తరపున హాజరైన ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో పాకిస్థాన్ మీడియా ఉడికిపోతోంది. చిన్నచిన్న దేశాల ప్రతినిధులకు కూడా అవకాశమిచ్చి అణ్వాయుధ శక్తి కలిగిన పాక్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఆ దేశానికి తీవ్ర అవమానమని పాక్ మీడియా గగ్గోలు పెడుతోంది.