: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే రెండుగా చీలిపోయింది: సుప్రీం కోర్టు
సకలజనుల సమ్మె సమయంలో రాష్ట్ర హైకోర్టుపై జరిగిన దాడి కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సకల జనుల సమ్మె సమయంలో రాష్ట్ర హైకోర్టులో జరిగిన గొడవలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఈ కేసును ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న రాష్ట్ర పభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ గొడవల అనంతరం హైకోర్టు ఇప్పటికే రెండుగా చీలిపోయిందంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ప్రాంత లాయర్లు ఆందోళన చేస్తూ హైకోర్టులో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కోర్టు కార్యకలాపాలకు కూడా విఘాతం కలిగించారు. ఇలా అయితే తాను రాజీనామా చేసేస్తానని ఆ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆందోళన చేస్తున్న లాయర్లపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీనిపైనే సుప్రీంకోర్టు మండిపడింది. లాయర్లను కొట్టడం తప్ప అన్ని రకాల విధ్వంసం సృష్టించారని ధర్మాసనం మండిపడింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో గొడవలు జరగుతుంటే నివారించకుండా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? అని ప్రశ్నించింది. ఇలా అయితే హైకోర్టులను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేసింది.