: హైదరాబాద్‌లో దారుణం... బీటెక్ విద్యార్థినిపై సీనియర్ల అఘాయిత్యం
హైదరాబాద్ శివారులోని బోడుప్పల్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని అసుపత్రికి తీసుకొచ్చిన సీనియర్లు ఏం జరిగిందని అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారు. తాము బైక్‌పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అయితే, ఆ బైక్ డ్రైవ్ చేసిన కార్తీక్ అనే విద్యార్థికి చిన్నదెబ్బ కూడా తగలలేదు. బైక్ కూడా ఎక్కడా చెక్కు చెదర్లేదు. దీంతో ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ నిపుణులు ఈ కేసులో పలు అంశాలను నిర్ధారించాల్సి ఉందని చెబుతున్నారు.
మరోపక్క, ఆ విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ, ఇదంతా పథకం ప్రకారమే చేసి, తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు ప్రతిరోజు మరో కాలేజీకి వెళుతోంది. పరీక్ష పూర్తైన తరువాత ఇంటికి వెళ్లేందుకు రాగా, అప్పటికే కాలేజీ బస్సు వెళ్లిపోయింది. అయితే, అదే సమయంలో ఆమెను కొందరు సీనియర్లు ఫాలో అయ్యారు. సీనియర్ విద్యార్థి కార్తిక్ ఆమె వద్దకు వెళ్లి ఇంటికి తీసుకెళతామని నమ్మించి, బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
మరో ముగ్గురు విద్యార్థులు మరో మార్గంలో అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నంలోనే ఆ విద్యార్థినికి తీవ్రగాయాలై అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆమె ప్రాణం పోతే తమకు జైలు శిక్ష పడుతుందని భావించిన ఆ విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ విద్యార్థిని కోలుకుంటే అసలు నిజం బయటపడుతుంది.