: 'యూ! ఇండియన్...' అంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు!
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. వ్యక్తిగత కక్ష ఉన్నవారిలా ఒక విద్యార్థిపై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... భారత్ కు చెందిన పర్దీప్ సింగ్ (25) టాస్మానియాలోని ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే పాకెట్ మనీ కోసం క్యాబ్ డ్రైవర్ గా పార్ట్ టైమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో వీకెండ్ కావడంతో శనివారం రాత్రి 10:30 నిమిషాలకు మెక్ డోనల్డ్ రెస్టారెంట్ వద్ద వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి క్యాబ్ కావాలనడంతో వారిని ఎక్కించుకున్నాడు. కారు రోడ్డుపై వెళ్తుండగా, ఈ ఇద్దరిలో ఓ మహిళ... డోర్ ను తెరిచి పట్టుకుంది. దీంతో పర్దీప్ సింగ్...అలా చేయకూడదని సూచించాడు.
వారు వినిపించుకోకపోవడంతో..కారుకు ఏదైనా నష్టం జరిగినా, రోడ్డు ప్రమాదం జరిగినా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని వారికి స్పష్టం చేశాడు. అంతే... వారిద్దరికీ కోపం ముంచుకొచ్చింది. ‘యూ.... ఇండియన్.. నీకు ఈ శాస్తి జరగాల్సిందే’ అంటూ బండబూతులు తిడుతు, కాళ్లతో తన్నుతూ, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దీంతో ఆ దారిన వెళ్తున్న వారు వారిని అడ్డుకుని, బాదితుడ్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీంతో పర్దీప్ సింగ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.