: రజనీ ఛరిష్మా ఏంటో నేను స్వయంగా చూశాను: నితిన్ గడ్కరీ


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, తమిళనాడులో రజనీకాంత్ కున్న ఛరిష్మాను స్వయంగా చూశానని అన్నారు. రజనీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు ఎప్పుడు వెళ్లినా వీలు చూసుకుని ఆయనను కలుస్తుంటానని అన్నారు. అలాగే తనకు బాగా తెలిసిన ఒక ఇంజనీర్ ను రజనీకి పరిచయం చేశానని అన్నారు. ఆ సందర్భంగా రజనీకాంత్ ఆ ఇంజనీర్ తో కరచాలనం చేశారని, దానికి ఉబ్బితబ్బిబ్బైన ఆ ఇంజనీర్ మూడు రోజులపాటు చేతులు ముడుచుకుని ఉన్నాడని, ఎవరినీ ముట్టుకోలేదని ఆయన తెలిపారు.

 రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తానని ఆయన చెప్పారు. రజనీ బీజేపీలో చేరితే ఆయనను సముచితంగా గౌరవిస్తామని తెలిపారు. రజనీకి ఏ స్థానమివ్వాలన్న విషయాన్ని పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు కలసి నిర్ణయిస్తాయని అన్నారు. రజనీది మహారాష్ట్ర అని గుర్తు చేసిన ఆయన, కొల్లాపూర్‌ నుంచి తమిళనాడుకు  ఆయన వచ్చారని తెలిపారు. రజనీకాంత్ ఇంటి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పెద్ద చిత్ర పటం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే కచ్చితమైన సమయమని చెప్పిన ఆయన, రజనీ మంచి కోరుకునే వాళ్లలో తాను కూడా ఒకడిని కావడంతో ఆయన బీజేపీలోకి చేరాలని సూచిస్తున్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News