: కత్రినా షేర్ చేసింది...వైరల్ అయింది... లక్షల్లో లైకులు వచ్చిపడ్డాయి!
హృద్యమైన, స్పూర్తిమంతమైన కథనాలకు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్ బుక్ పేజ్ పెట్టింది పేరు. వ్యక్తిగత అనుభవాలను హృద్యంగా అందర్నీ ఆకట్టుకునేలా రాస్తారు. తాజాగా ఒక పోలీసు అనుభవం, సేవలను వివరిస్తూ ఒక కథనాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిని చూసిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ షేర్ చేసింది. అంతే.. ఇది ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకెళ్తోంది. ఇక కత్రినా షేర్ చేసిన ఆ పోస్టులోకి వెళ్తే... ఒక పోలీసు అధికారిణి తన గురించి వివరిస్తూ...‘నా సోదరులంతా పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడినవారే. వారిని చూస్తూనే పెరిగాను. ఇక నాకు పోలీసు ఉద్యోగం ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ఎవరి మీదా ఆధారపడకుండా ఇతరులను సంరక్షిస్తూ, నన్ను నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కానిస్టేబుల్ అవ్వాలనుకున్నాను.
కారణాలేవైనా కానీ...సమాజంలో చోటుచేసుకుంటున్న సంఘటనల కారణంగా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు నాటుకుపోతున్నాయి. పోలీసులంటే బద్ధకస్తులని, అవినీతి పరులని, విధులపట్ల అశ్రద్ధగా ఉంటారని, అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేసినా పట్టించుకోరని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. నేను మాత్రం అలా కాదు. అలా వచ్చిన అత్యవసర ఫోన్లకు స్పందించాను. రాత్రి వేళల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే... వెంటనే నేనే సొంతంగా వ్యాన్ నడుపుకొంటూ వెళ్తాను. అలాగే ముంబైలోని కొన్ని ప్రదేశాల్లో నాకు తెలిసిన మహిళల్ని కాపలాగా పెట్టాను. ఎవరికైనా ఆపద వస్తే వారు నాకు ఒక్క ఫోన్ చేస్తారు. వెంటనే నేను స్పందిస్తాను. మీకే అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకండి. మమ్మల్ని నమ్మండి. మీ నమ్మకాన్ని వమ్ముచేయం’ అని పేర్కొంది. ఈ పోస్టు కత్రినా షేర్ చేసిన అనంతరం వైరల్ గా మారి లక్షల్లో లైకులు, కామెంట్లు, షేర్లతో దూసుకుపోతోంది.