: నేను, నా కుటుంబ సభ్యులు హత్యా రాజకీయాలు చేయం: డిప్యూటీ సీఎం కేఈ
తాను, తన కుటుంబ సభ్యులు హత్యా రాజకీయాలు చేయమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య దురదృష్టకరమని, ఆయన్నిహత్య చేసింది ఎవరో తెలియకుండానే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నారాయణరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం తనకు లేదని, తాను, తన కుటుంబం ఏ విచారణకైనా సిద్ధమేనని, ఈ కేసు విచారణలో తాను అడ్డుపడనని చెప్పారు. ఈ హత్య కేసుతో టీడీపీకి, సీఎంకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, తన కుమారుడు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్నాడని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నడిపే సత్తా తమకు ఉందని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ పాలనలో తమను ఇబ్బందిపెట్టినా తట్టుకుని నిలబడ్డామని అన్నారు.