: యెడ్డీకి ఇడ్లీల తలనొప్పి.. విరుచుకుపడుతున్న విపక్ష నేతలు!
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల యెడ్యూరప్ప, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పలు తుముకూరు జిల్లాలో ఓ దళితుడి ఇంట్లో బస చేశారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించారు. అయితే, యెడ్డీ తిన్న ఇడ్లీలు ఆ కుటుంబం చేసినవి కాదని... ఓ హోటల్ నుంచి తెప్పించుకున్నారనే విషయం వెలుగు చూసింది. ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. యెడ్యూరప్ప ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు యెడ్యూరప్పపై కేసు నమోదు చేయాలంటూ మాండ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
అయితే యెడ్డీ చేసిన పనిని బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. దళితుల కోసం బీజేపీ ఎంతో చేసిందని... ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని నేతలు అంటున్నారు. దళితుల ఇంట్లో వండిన పులావును యెడ్డీ రుచి చూశారని... అయితే, ఆయనకు ఇడ్లీ, వడ అంటే చాలా ఇష్టమని... అందుకే వాటని హోటల్ నుంచి తెప్పించారని బీజేపీ కర్ణాటక మీడియా ఇన్ ఛార్జ్ దగ్గే శివప్రకాశ్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, దళితుల ఇంట్లో భోజనాలు చేయడం యెడ్డీ చేస్తున్న గిమ్మిక్కుల్లో ఓ భాగమని విమర్శించారు. ఓట్ల కోసం ఇంతలా దిగజారడం దారుణమని చెప్పారు.