: మా ఓటమికి ఇదే కారణం!: స్మిత్
ఐపీఎల్ లో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి వరకు పూణె జట్టును విజయం ఊరిస్తూనే ఉంది. కానీ, చివరకు ఆశలు ఆవిరైపోయాయి. పూణే విజయం ఖాయమని అంతా భావించినప్పటికీ... చివరకు ఒక్క పరుగు తేడాతో పూణె జట్టు ఓటమిపాలైంది. కెప్టెన్ స్మిత్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ... జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ అనంతరం స్మిత్ చాలా విచారంగా కనిపించాడు. చాలా నిర్వేదంగా మాట్లాడాడు. ఈ ఓటమిని దిగమింగుకోవడం చాలా కష్టమని చెప్పాడు.
లక్ష్యం చిన్నదైనప్పటికీ... ఈ వికెట్ మీద పరుగులు సాధించడం చాలా కష్టంగా మారిందని... అందువల్లే ఓటమిపాలయ్యామని స్మిత్ చెప్పాడు. తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని చెప్పాడు. తమను పరుగులు చేయకుండా నిలువరించడంలో వారు సఫలమయ్యారని తెలిపాడు. ఐపీఎల్ లో ఆడటం చాలా గొప్ప అనుభవమని... గత రెండేళ్లుగా ఐపీఎల్ ద్వారా చాలా నేర్చుకున్నానని చెప్పాడు.