: జస్టిస్ కర్ణన్ శిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతికి మరోమారు వినతి
జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ మరో వినతి పత్రాన్ని ఆయన తరపు న్యాయవాది సమర్పించారు. కర్ణన్ కుమారుడు, హైకోర్టు న్యాయవాది సి.ఎస్.సుగన్ తో కలసి, న్యాయవాది మాథ్యూస్ జెనెడుంపర ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ మెహతాకు ఈ వినతిపత్రం సమర్పించారు. కాగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కు అత్యున్నత న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న కర్ణన్, తాను క్షమాపణలు చెబుతానని ప్రాధేయపడినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ఈ క్రమంలో కర్ణణ్ కు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి ఆయన తరపు న్యాయవాది మరోమారు వినతిపత్రం సమర్పించారు.