: క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో మోసం.. అమెజాన్‌పై వినియోగదారుల ఫోరం ఆగ్రహం.. రూ.20 వేలు చెల్లించాలని ఆదేశం
క్యాష్‌బ్యాక్ ఆఫర్ పేరుతో వినియోగదారుడిని మోసం చేసిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్ భోగా డిసెంబరు, 2014లో ఆపిల్ ఐఫోన్ 5సీ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6500 క్యాష్‌బ్యాక్ వస్తుందని, వినియోగదారుడి ఖాతాలో అది జమ అవుతుందని అమెజాన్ పేర్కొంది. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నాకే సుశాంత్ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ హామీని అమెజాన్ నెరవేర్చుకోలేదు. సుశాంత్ ఖాతాలో రూ.6500 జమకాలేదు.
దీంతో అతడు జూన్ 2015లో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలిలో ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తర్వాత హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం-3ని ఆశ్రయించాడు. అయితే ఆఫర్‌కు, తమ వెబ్‌సైట్‌కు సంబంధం లేదని అమెజాన్ వాదించింది. అమెజాన్ కస్టమర్‌ను, అమ్మకందారును కలిపే వేదిక మాత్రమేనని పేర్కొంది. క్యాష్‌బ్యాక్ అనేది మూడో వ్యక్తికి సంబంధించిన విషయమని గట్టిగా వాదించింది.
అయితే వెబ్‌సైట్‌పై నమ్మకంతోనే వినియోగదారులు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లకు ఆకర్షితులవుతారని వినియోగదారుల ఫోరం పేర్కొంది. మూడో వ్యక్తి గురించి వినియోగదారులకు తెలియదని, హామీలు అమలుకాకపోతే అది అక్రమ వ్యాపారం అవుతుందని పేర్కొంది. ఇందుకు వెబ్‌సైటే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ బాధిత వినియోగదారుడికి రూ.15 వేల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.