: దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 52 కేజీల బంగారం పట్టివేత.. విలువ రూ.15 కోట్లు
దుబాయ్ నుంచి సముద్ర మార్గం గుండా బంగారాన్ని భారీ ఎత్తున భారత్‌కు చేర్చాలన్న ఓ ముఠా గుట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆ ముఠా పన్నాగాన్ని పసిగట్టి చెక్ చెప్పారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన 52 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం డీఆర్ఐ చరిత్రలోనే ఇది తొలిసారి. ఆదివారం గుజరాత్‌లోని కచ్ ముద్రా పోర్టులో ఓ షిప్‌లోని గుడ్ల కంటెయినర్ నుంచి ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై విదేశీ ముద్ర ఉంది.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త హార్నెక్ సింగ్‌కు చెందిన పారం ఎక్విప్‌మెంట్స్ కంపెనీకి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సింగ్ గతంలోనూ అక్రమంగా 44 కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకోగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈనెల 13నే అతడు అరెస్టయ్యాడు. సింగ్ ఇప్పటి వరకు రూ.600 కోట్ల విలువైన రూ.2 వేల కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేసి ఉంటాడని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.