: ఆ చిత్రంలో సింధు నటిస్తే బాగుంటుంది... ఏ పాత్రలో అయినా ఓకే!: సోనూ సూద్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు జీవిత చరిత్రపై సోనూ సూద్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పీవీ సింధు కూడా నటిస్తే... ఈ బయోపిక్ కు మరింత సార్థకత చేకూరుతుందని సోనూ సూద్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ, సింధు బయోపిక్ లో సింధు కూడా నటించాలని కోరుకుంటున్నానన్నాడు. టైటిల్ రోల్ లో కాకపోయినా అతిథి పాత్రలో నటించినా ఫర్వాలేదని పేర్కొన్నాడు. సినిమా ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే ఉందని చెప్పిన సోనూ సూద్, సింధు ఏ సన్నివేశంలో నటిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమా సింధుపై బయోపిక్ కాబట్టి ఆమె కూడా ఉంటే ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ఈ ఆఫర్ కు సింధు ఏమంటుందో?