: కోట్లలో వేతనం అందుకుంటున్న ఐపీఎల్ జట్ల మెంటార్లు.. ఢిల్లీ మెంటార్ రాహుల్ ద్రవిడ్ జీతం ఏడాదికి రూ.4.5 కోట్లు!
ఐపీఎల్ ప్రారంభమై పదేళ్లు అయింది. క్రికెటర్ల వేలం నుంచి అన్నీ బహిర్గతమే. క్రికెటర్లు ఎంత పుచ్చుకుంటున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ తెలియని విషయం ఒకటుంది. జట్టు మెంటార్లు, కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నారన్న విషయం నేటికీ సస్పెన్సే. తాజాగా ఈ రహస్యం వెల్లడయింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీ మెంటార్ రాహుల్ ద్రవిడ్‌కు ఏడాదికి రూ.4.5 కోట్లు చెల్లిస్తున్నట్టు బయటపడింది.
ముంబై మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్‌కు ఎంత చెల్లిస్తున్నారన్న విషయం తెలియనప్పటికీ అది కచ్చితంగా ద్రవిడ్ కంటే ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఐపీఎల్ ఆటగాళ్లేతరులలో అత్యధికంగా అందుకుంటున్నది సచిన్ ఒక్కడే. గతంలో ముంబై కోచ్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు కూడా రూ. 4.5 కోట్లే చెల్లించినట్టు చెబుతున్నారు. ఆర్‌బీసీ మెంటార్ వెటోరి, కోల్‌కతా మెంటార్ కలిస్, పంజాబ్ మెంటార్ వీరంద్ర సెహ్వాగ్ లు మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయలు అందుకుంటున్నట్ట సమాచారం.