: వలస, వారసత్వ నేతలకు జనసేనలో నో చాన్స్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధం!
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు రెడీ అవుతోంది. పార్టీలోకి వలస, వారసత్వ నేతలను చేర్చుకోరాదని నిర్ణయించింది. ప్రజల్లో నుంచే నేతలను ఎంపిక చేసుకునేందుకు ప్రతిభ గల వ్యక్తుల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామందిని వడపోసి యువనేతలను ఎంచుకుంది. ఉత్తరాంధ్రలోనూ మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకోబోతోంది. ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకున్న అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది.
విషయం, ప్రతిభ ఉన్న వారి కోసం మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల రచన, మాట్లాడే తీరు, సమస్యలపై వారికి ఉన్న అవగాహనను వీడియో తీసి నిపుణుల సమక్షంలో దానిని పరిశీలించి మార్కులు వేస్తారు. వారివారి విభాగాల్లో మంచి పనితీరు కనబరిచిన వారిని ఎంపిక చేసి చివరిగా పవన్ నేతృత్వంలో ఓ టీమ్‌ను ఎంపిక చేస్తారు. ఇదీ జనసేన వ్యూహం. నాయకులు ప్రజల్లో నుంచే రావాలని, వారసత్వ, వలస నేతలను పార్టీకి దూరంగా ఉంచాలని భావిస్తోంది. తద్వారా రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది.