: మా అత్యుత్తమ పోరాటం సరిపోలేదనుకుంటున్నా: గంభీర్ భావోద్వేగపూరిత ట్వీట్

ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచులో ఇక కప్పు కోసం జరిగే తుదిపోరు మాత్రమే మిగిలి ఉంది. రేపు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్లకు 107 పరుగులు మాత్రమే చేసి, ఆ తరువాత ఫీల్డింగ్‌లోనూ విఫలమై ముంబయి ఇండియన్స్‌కు విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోల్‌కతా టీమ్ సారథి గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో తమ ఓటమిపై భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ లో నైట్‌రైడర్స్ ప్రస్థానం ముగియడంతో తమ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. తమ జట్టు పట్ల ఎనలేని ఆదరణ చూపించిన అభిమానులకు వందనాలు తెలుపుతున్నానని, అందరికీ చెప్పేదొకటేనని, ఈ ప్రస్థానం ఒక సరదా కాదని అన్నాడు. శక్తి వంచన లేకుండా పోరాడామని, ఐతే తమ అత్యుత్తమ పోరాటం సరిపోలేదనుకుంటున్నానని పేర్కొన్నాడు.