: అత్యాచారానికి యత్నించిన దొంగ స్వామికి తగినశాస్తి చేసిన యువతి!
తనపై అత్యాచారానికి యత్నించిన ఓ దొంగ బాబాకు ఓ యువతి తగినశాస్తి చేసింది. అతడి పురుషాంగాన్ని కోసేసిన సంఘటన కేరళలో జరిగింది. కోళ్లామ్ లోని పద్మనలో గణేషానంద తీర్థపద స్వామి (54) అలియాస్ హరి ఆశ్రమంలో ఇరవై మూడేళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. గణేషానంద స్వామిగా కూడా ఆయన్ని పిలుస్తుంటారు. స్వామిపై అపారమైన విశ్వాసం ఉన్న ఆమె తల్లిదండ్రులు, అక్కడే సేవలు చేస్తుండేవారు. అయితే, ఆ స్వామి మాత్రం ఆ యువతిపై కన్నేశాడు. రెండు రోజులుగా ఆమెపై మితిమీరి ప్రవర్తిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్వామి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో, తిరగబడ్డ సదరు యువతి అతని పురుషాంగాన్ని కోసేసింది. ఈ మేరకు తిరువనంతపురం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. పోస్కో చట్టం కింద దొంగస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కాగా, తీవ్రంగా గాయపడ్డ దొంగ స్వామిని తిరువనంతపురం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.