: చంద్రబాబుకు మాట రాకూడదనే ఓపిక పట్టాం.. లేకుంటేనా..!: కరణం వెంకటేశ్
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో తమ వర్గీయులు ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేయడంపై ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. దీనికంతటికీ కారణం ఎమ్మెల్యే గొట్టిపాటి రవినే అని చెప్పారు. గతంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలను మోసం చేశాడని... ఇప్పుడు టీడీపీలోకి వచ్చి 95 వేల మంది కార్యకర్తలను మోసం చేయాలని చూస్తున్నాడంటూ గొట్టిపాటిపై విరుచుకుపడ్డారు. కేవలం స్వలాభం కోసమే గొట్టిపాటి రవి టీడీపీలో చేరారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట రాకూడదనే కారణంతోనే తాము ఓపికపడుతున్నామని... లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. టీడీపీని నమ్ముకునే వేలాది మంది తమకు ఓటు వేశారని అన్నారు. కార్యకర్తలకు మేలు జరగాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.