: మరొకరిని బలిగొన్న హైదరాబాదు మెట్రో పిల్లర్!
మెరుగైన ప్రజా రవాణా కోసం, ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు జంట నగరవాసులకు నరకం చూపిస్తోంది. ఓ పద్ధతి, పాడు లేకుండా రోడ్లపైకి వచ్చేలా నిర్మించిన మెట్రో స్టేషన్లు ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచుతున్నాయి. రోడ్డు మధ్యలో వందలాదిగా ఉన్న పిల్లర్లు ఏకంగా ప్రాణాలనే హరిస్తున్నాయి. మెట్రో పిల్లర్లను వాహనదారులు ఢీకొడుతున్న ఘటనలు నిత్యకృత్యమైపోతున్నాయి. ఇలాంటి ఘటనలోనే ఏపీ మంత్రి నారాయణ కుమారుడు ఇటీవలే ప్రాణాలు వదిలాడు. కొత్తపేట సమీపంలో పిల్లర్ ను కారు ఢీకొన్న ఘటనలో ఓ సీఐ తీవ్ర గాయాలపాలయ్యారు.
తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ కు మరొకరు బలయ్యారు. ఎల్బీనగర్ దగ్గరున్న మెట్రో పిల్లర్ ను ఓ డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ సర్దార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా గుర్తించారు. ఖమ్మం నుంచి హైదరాబాదుకు వంటచెరకును తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.