: వేమవరం ఫ్యాక్షన్ ఘటనపై బలరాం తీవ్ర వ్యాఖ్యలు.. రవికుమార్ రెచ్చగొడుతున్నాడన్న కరణం


ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్యలపై ఎమ్మెల్సీ కరణం బలరాం స్పందించారు. ప్రశాంతంగా ఉన్న ఊరిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చిచ్చుపెట్టాడని ఆరోపించారు. తాము సంయమనం పాటిస్తున్నా ఆయన మాత్రం రెచ్చగొడుతూనే ఉన్నారని అన్నారు. పార్టీలోని సీనియర్ నేతల పట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలు ఆయన తీరును జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావుల మృతదేహాలను ఈ ఉదయం బలరాం సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిని పరామర్శించారు. కాగా, వేమవరంలో వివాహానికి హాజరై వస్తున్న వారిపై ప్రత్యర్థులు కంట్లో కారం చల్లి దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వేమవరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News