: జీఎస్టీ ఎఫెక్ట్... ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే!
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న జీఎస్టీ వల్ల పలు వస్తువుల ధరలు దిగిరానున్నాయి. జీఎస్టీ అమలైతే బియ్యం, గోధుమలు తదితర వస్తువులకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై వ్యాట్ పేరుతో పన్ను వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి ఈ పన్ను బాధ ఉండదు కాబట్టి... వీటి ధరలు తగ్గుతాయి. వీటితో పాటు హెయిర్ ఆయిల్, వంట నూనె, పంచదార, పెయింట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టూత్ పేస్టులు, సబ్బుల ధరలు తగ్గుతాయి.
స్వీట్లు ప్రస్తుతానికి 5 శాతం పన్ను శ్లాబులో ఉన్నాయి. దీనికి తోడు వ్యాట్ బాదుడు కూడా ఉంది. జీఎస్టీతో వీటి ధరలు కూడా దిగి రానున్నాయి. చిన్న కార్లు, తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ ధరలు తగ్గనున్నాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి. వీటి కోసం ప్రస్తుతం మనం 31 నుంచి 32 శాతం వరకు పన్ను చెల్లిస్తున్నాం. ఇప్పుడు రానున్న పన్నుల విధానంలో వీటిని 28 శ్లాబులో ఉంచారు. అందువల్ల వీటి ధరలు కూడా కొంచెం తగ్గనున్నాయి.