: కించపరిచేలా ఫొటోలు అప్ లోడ్.. వాట్సాప్ అడ్మిన్ అరెస్ట్
సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఫొటోలు పెట్టడం, ఇతరులను కించపరిచేలా ఉన్న సమాచారాన్ని షేర్ చేయడం చేస్తే... తాట తీస్తామంటూ పోలీసులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. సైబర్ చట్టం ప్రకారం సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరు తప్పు చేసినా అడ్మినే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచేలా ఫొటో పెట్టినందుకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కేసు నమోదైంది.
ఉట్నూరులోని అభి డిజిటల్ ఫొటో స్టూడియో యజమాని రవీందర్ వాట్సాప్ గ్రూప్ ను తయారు చేశాడు. అందులో దేవుళ్లను కించపరిచేలా ఫొటోలు పెడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, రవీందర్ పెట్టిన ఫొటోలకు స్పందిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీను నాయక్, ఉషశ్రీ, నారాయణలపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.