: అబద్ధాలతో పోలీసులను ఆడుకున్న బాలిక.. చివరికి కథ సుఖాంతం
తరచూ ఇంట్లో నుంచి పారిపోయే అలవాటున్న బాలిక తాజాగా హైదరాబాద్ పోలీసులను ఆడుకుంది. అబద్ధాలతో చక్కని కట్టుకథ అల్లి వారిని నమ్మించింది. చివరికి కథ సుఖాంతమైంది. పుణెలో నివసించే హనీఫ్ కుమార్తె అస్మా తరచూ ఇంట్లో నుంచి పారిపోవడం ఆమెకు అలవాటుగా మారింది. దీంతో విసుగు చెందిన తండ్రి హనీఫ్ 15 రోజుల క్రితం కుమార్తెను హైదరాబాద్ తీసుకొచ్చి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్‌లో నివసించే అస్మా నాయనమ్మ వద్ద ఆమెను విడిచిపెట్టి వెళ్లాడు.
గురువారం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అస్మాను చూసిన కొందరు యువకులు ఆమె తప్పిపోయిందని భావించి చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. బాలిక వివరాల గురించి ఆరా తీసిన పోలీసులకు.. పుణె నుంచి ఎవరో తీసుకొచ్చి తనను ఇక్కడ వదిలేశారంటూ కట్టుకథ చెప్పి వారిని నమ్మించింది. దీంతో రెండు రోజులుగా అవే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. దినపత్రికల్లో వచ్చిన వార్తను చూసిన అస్మా నాయనమ్మ వహీదా బేగం శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమె తన మనవరాలేనని పేర్కొంది. దీంతో పుణెలోని ఆమె తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరించిన అనంతరం అస్మాను వహీదాకు అప్పగించారు.