: యూపీలోని ఓ చర్చిలో బలవంతపు మతమార్పిడిలు.. ‘హిందూ యువ వాహిని’ ఆందోళన!


ఉత్తరప్రదేశ్ లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న చర్చిలో దళితులను బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని ఆరోపిస్తూ హిందూ యువ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఔరాయి తాలూకా తియూరి గ్రామంలోని ఓ ఇంట్లో ఈరోజు చర్చి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కేరళకు చెందిన  అజ్మన్ అబ్రహామ్ పాస్టర్ గా వ్యవహరిస్తున్నారు. దళితులను బలవంతపు మతమార్పిడి చేస్తున్నారనే విషయం తెలుసుకున్న హిందూ యువవాహిని కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా హిందూ యువవాహిని జిల్లా అధ్యక్షుడు సుభాష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్చిలో కొన్నాళ్లుగా బలవంతపు మతమార్పిడులు జరుగుతున్న విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే, తాము ఆందోళనకు దిగామన్నారు. కాగా, హిందూ యువవాహిని అనే సంస్థను గతంలో యోగి ఆదిత్యానాథ్ స్థాపించారు. గత నెలలో మహారాజ్ గంజ్ లోని ఓ చర్చి వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న వారిని ‘హిందూ యువవాహిని’ చెదరగొట్టింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News