: విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి అఖిలపక్ష సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న నేతలు
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో తలెత్తిన సమస్యల పరిష్కారాలపై చర్చించడమే లక్ష్యంగా విజయవాడలో ఈ రోజు ప్రత్యేక హోదా సాధన సమితి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టం 2014లోని 108 నిబంధనపై చర్చ జరిగింది. విభజన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున పోరాడతామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తోన్న చిన్నపాటి సాయానికే రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిపడిపోతోందని చెప్పారు. రాష్ట్ర విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి నిలదీయకపోతే ధర్నాలు చేయడానికి సిద్ధమని సీపీఐ నేతలు ప్రకటించారు. ఈ నెల 24న రాయలసీమ బంద్కు సీపీఐ పిలుపునిచ్చింది. 27న ఉత్తరాంధ్రలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, త్వరలో గవర్నర్, రాష్ట్రపతిని కలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీపీఐ నేతలు తెలిపారు.