: పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే కనిపించకుండా పోయిన పెళ్లికొడుకు!
అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో, పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య అతడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లింట అంతా సందడి ఉంది. తమ కూతురు ఇక మెట్టినింట్లో కాలు పెట్టబోతోందని, ఆ ఇంట్లో దీపం పెట్టబోతోందని పెళ్లి కూతురి తల్లిదండ్రులు తమ బంధుమిత్రులతో మాట్లాడుకుంటున్నారు. అంతా పెళ్లి భోజనాలు చేసి సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే వారికి ఊహించని వార్త తెలిసింది. పెళ్లి కొడుకు కనిపించడంలేదని ఎవరో వచ్చి చెప్పారు. అంతాకలిసి పెళ్లికొడుకుని వెతికారు. లాభం లేదు... పెళ్లి అయిన కొన్ని గంటలకే పెళ్లికొడుకు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చేస్తోంది.
దీంతో అంతా కలిసి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కళావతి, వెంకటస్వామి దంపతుల రెండవ కూతురు వెంకటలక్ష్మికి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూరు గ్రామానికి చెందిన రమణమ్మ, నరసింహ దంపతుల ప్రథమ పుత్రుడు కురుమూర్తితో వివాహం జరగగా, కురుమూర్తి ఇలా అదృశ్యమైపోయాడు. ఆయన ఫిల్మ్ డెరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.