: బంపర్ ఆఫర్... 'నీ బాయ్ ఫ్రెండ్ ను నాకిస్తే కోటిన్నర ఇస్తా' అంటున్న అమ్మాయి!
'శుభలగ్నం' సినిమా చూశారా?...మనసుకు నచ్చిన జగపతిబాబును వివాహం చేసుకునేందుకు ఆమనికి రోజా కోటి రూపాయలు ఆఫర్ చేస్తుంది. అచ్చం ఇలాంటి ఘటనే మలేసియాలో చోటుచేసుకుంది. మలేషియాకి చెందిన జోసి లీ (38) అనే సంపన్నురాలు డ్యానీ టాన్ అనే యువకుడిపై మనసు పడింది. అయితే అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండడంతో ఆమెవైపు చూడడం లేదు. దీంతో అతనిని ఎలాగైనా ముగ్గులోకి దింపాలని జోసీ నిర్ణయించుకుంది. దీంతో డ్యానీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ నెంబర్లు ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకునేంది. డ్యానీ ఎన్ని ఫోన్లు మార్చినా, సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేసినా, మరొకటి ప్రారంభించగానే ఆమెకు తెలిసిపోయేది.
అంతే కాకుండా తన వ్యక్తిగత విషయాలు చెబుతూ, ప్రైవేట్ ఫోటోలు పంపేది. దీంతో విసిగిపోయిన డ్యానీ తన జోలికి రావద్దంటూ జోసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా అయితే పని జరగడం లేదని భావించిన జోసీ ఈ సారి ఆమె గర్ల్ ఫ్రెండ్ నుంచి నరుక్కురావాలని భావించింది. దీంతో డ్యానీ గర్ల్ ఫ్రెండ్ జోయి టాన్ దగ్గరకెళ్లి 'కోటిన్నర రూపాయలు ఇస్తాను...నీ బాయ్ ఫ్రెండ్ ను నాకు వదిలెయ్' అని ఆఫర్ ఇచ్చింది. దీంతో బిత్తరపోయిన జోయి...దీని గురించి సోషల్ మీడియాలో పెడుతూ, 'నీ కోటిన్నర నాకు అక్కర్లేదు... మేము విడిపోయినా అతడు నావాడనే సంతృప్తి నాకు మిగిలే ఉంటుంది. అయినా నేను అతనిని ఎందుకు వదులుకోవాలి? నీకు డబ్బున్నంత మాత్రాన అతని ప్రేమను త్యాగం చెయ్యాలా? సరే నాకు బ్రేకప్ ధర చెప్పావు. బాగుంది. మరి నువ్వు అతనిని పూర్తిగా వదిలేయడానికి ఎంత కావాలో చెప్పు, నేను చెల్లిస్తాను' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. జోయి చెప్పిన ఈ సమాధానం జోసీకి నచ్చకపోయినా డ్యాలీని మాత్రం ఆనందంలో ముంచెత్తి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు కదా!