: మరో బాదుడుకు రంగం సిద్ధం... రైలు ప్రయాణం మరింత ప్రియం!
రైలు ప్రయాణం మరింత భారం కానుంది. కొత్తగా 'సేఫ్టీ సెస్' పేరిట మరో సుంకాన్ని ప్రయాణికులపై వేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆగమేఘాల మీద కదులుతోంది. రైల్వే ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా తీసుకునే చర్యలకు అవసరమైన నిధుల కోసం ఈ అదనపు పన్నుతో వచ్చిన లాభాలను వినియోగిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొత్త పన్నుతో సాలీనా రూ. 5 వేల కోట్ల మేరకు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. "మనం ప్రజల కోసం సురక్షా నిధిని పెంచుకోవాలి. ప్రజల నుంచి కూడా దీనిపై సానుకూల స్పందన వస్తుందనే భావిస్తున్నాం. దీనికోసం అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాం" అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు.
కాగా, వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతో రైల్వే సురక్షా నిధిని ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని, ఈ నిధులతో ట్రాక్ ల అభివృద్ధి, సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, కాపలా లేని క్రాసింగ్ లను తొలగించడం వంటి పనులు చేపడతామని బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సంవత్సరం సమీకరించాల్సిన రూ. 20 వేల కోట్ల నిధిలో భాగంగా రూ. 10 వేల కోట్లను సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి, రూ. 5 వేల కోట్లను ఆర్థిక శాఖ నుంచి పొందిన రైల్వే శాఖ, మిగతా రూ. 5 వేల కోట్లను సొంతంగా సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసమే తాజా టికెట్ ధరల పెంపు ఆలోచన చేస్తోందని సమాచారం. ప్రయాణికులపై బాదుడుతో పాటు సరకు రవాణా చార్జీలను కూడా పెంచాలని భావిస్తున్నట్టు రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు.