: వదంతులు నమ్మి ఆరుగురిని కొట్టి చంపిన జార్ఖండ్ వాసులు... ఆపేందుకు వెళ్లిన పోలీసులకూ గాయాలు!
కొంతమంది వ్యక్తులు గ్యాంగులుగా మారి చిన్నారులను అపహరిస్తున్నారన్న వదంతులు వ్యాపించడంతో, రెచ్చిపోయిన అల్లరిమూకలు ఆరుగురు అనుమానితులను దారుణంగా కొట్టి చంపడంతో పాటు వారిని కాపాడేందుకు వచ్చిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ ఘటన జార్ఖండ్ లోని సింగ్ భూమ్, సరాయ్ కేలా జిల్లాల్లో జరిగింది. ఓ ఇంట్లో ఉన్న వికాస్ కుమార్ వర్మ, గౌతమ్ కుమార్ వర్మ, గణేష్ గుప్తాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్న ఆరోపణలపై వారిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపారు అక్కడి ప్రజలు. వారితో పాటు ఉన్న ఓ మహిళను కూడా తీవ్ర గాయాలు అయ్యేలా చితకబాదారు.
ఇదే సమయంలో వదంతులు పక్కనే ఉన్న ప్రాంతాలకూ వ్యాపించగా, ఓ నిరసనమూక పశు వ్యాపారం చేసుకునే కుటుంబంపైకి దూసుకెళ్లి, నయీమ్, సిరాజ్ ఖాన్, సజ్జులను కొట్టి చంపింది. ఈ రెండు ఘటనల్లో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పటికీ, నిరసనకారుల సంఖ్య వందల్లో ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. పోలీసులపైనా వీరు దాడులకు దిగారు. వారు వచ్చిన కార్లు, జీపులను తగులబెట్టారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పలువురు చిన్నారులు అదృశ్యం కావడం, అదే సమయంలో కిడ్నాపర్లు వచ్చారన్న వదంతులు వ్యాపించడంతోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని, పరిస్థితి అదుపు తప్పకుండా మరిన్ని బలగాలను మోహరించామని ఉన్నతాధికారులు తెలిపారు.