: డబ్బుంటేనే పార్టీలో ఉండాలని జగన్ చెప్పారు... బాధేసింది: విశాఖ నేత కర్రి సీతారాం
ఈ ఉదయం వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద డబ్బుంటేనే పార్టీలో ఉండాలని జగన్ అన్నారని, ఆయన మాటలతో తనకెంతో బాధ కలిగిందని చెప్పారు. 2014లో ఎన్నికల కోసం తన ఆస్తులమ్మి మరీ డబ్బు ఖర్చు పెట్టి వైకాపాకు సేవ చేశానని, ఇప్పుడు తన వద్ద అంత డబ్బు లేకపోవడంతోనే మరో వ్యక్తిని సమన్వయకర్త పేరిట భీమిలి నియోజకవర్గంలో తెరపైకి తెచ్చారని సీతారాం ఆరోపించారు. డబ్బులు ఖర్చు పెట్టేవారు మాత్రమే పార్టీకి ముఖ్యమని జగన్ చెప్పడంతోనే మనస్తాపంతో వైకాపాను వీడినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ఉద్దేశం తనకు లేదని, తనవారితో చర్చించిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.