: భారత్ కు గుడ్ బై చెప్పనున్న షెవర్లే... నిలిచిపోనున్న స్పార్క్, బీట్, తవేరా, సెయిల్, క్రూజ్ విక్రయాలు

భారత మార్కెట్లో 20 సంవత్సరాలుగా వాహన విక్రయాలు జరుపుతున్నా లాభాలను నమోదు చేయడంలో విఫలమవుతున్న అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) షవర్లే బ్రాండ్ వాహనాల విక్రయాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ కల్లా వాహనాల విక్రయాలు ఆపివేస్తామని, ఇండియాలోని ప్లాంటును కొనసాగిస్తూ, కేవలం ఎగుమతిపై మాత్రమే దృష్టిని సారిస్తామని జీఎం ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండీ కహర్ కజెమ్ వెల్లడించారు.

ప్రస్తుతం జీఎం స్పార్క్, బీట్, సెయిల్ హ్యాచ్ బ్యాక్, సెయిల్ సెడాన్, ఎంజాయ్, తవేరా, క్రూట్, ట్రెయిల్ బ్లేజర్ వాహనాలను రూ. 3.73 లక్షల నుంచి రూ. 24.7 లక్షల మధ్య విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి అమ్మకాలను నిలిపి, విక్రయానంతర సేవలను మాత్రం కొనసాగిస్తామని కహర్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే గత నెలలో గుజరాత్ లోని తన తొలి ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేసి, చైనాకు చెందిన ఎన్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ కు ప్లాంటును విక్రయించాలని చూస్తున్న సంస్థ 1100 మంది ఉద్యోగులనూ తొలగించింది.

ఇదిలావుండగా, ఇండియాలో భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా సమీక్షించిన తరువాతనే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని జనరల్ మోటార్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో బ్రాండుతో విక్రయాలను తిరిగి ప్రారంభించే ఆలోచనేదీ లేదని, ఇండియాతో పాటు రష్యా, ఐరోపా, దక్షిణాఫ్రికా వాహన మార్కెట్ల నుంచి కూడా నిష్క్రమిస్తున్నామని వెల్లడించారు. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరలేకపోవడం, గతంతో పోలిస్తే మార్కెట్ వాటా గణనీయంగా తగ్గడం వంటి కారణాలతో ఇండియా నుంచి సంస్థ వైదొలగుతోంది. 2013-14లో రూ. 3,812 కోట్లు, 2014-15లో రూ. 1003 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంస్థ, లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించకనే భారత్ నుంచి వైదొలగుతోందని ఆటో రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News